- ఫ్రీగా నేనూ చూశాను,సినిమా మాఫియాను ఉరి తీయండి
హైదరాబాద్: సీపీఐ సీనియర్ నేత నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్, అలాగే మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ అంశాలపై స్పందిస్తూ ఆయన వ్యవస్థాగత లోపాలను తీవ్రంగా దుయ్యబట్టారు.ఐబొమ్మలో సినిమాలు చూసిన నారాయణ
ఐబొమ్మ వ్యవహారంపై మాట్లాడిన నారాయణ, తాను కూడా ఆ వెబ్‌సైట్‌లో సినిమాలు ఫ్రీగా చూసినట్లు బహిరంగంగా ఒప్పుకున్నారు. “ఆరేడు వందలు పెట్టి సామాన్యులు సినిమాలు ఎలా చూసేది? నేను కూడా ఐబొమ్మలోనే సినిమాలు ఫ్రీగా చూశాను” అని ఆయన వ్యాఖ్యానించారు.సినిమా పరిశ్రమ అధిక టికెట్ ధరలను నిర్ణయించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “కోట్లు ఖర్చు పెట్టి టికెట్ ధరల కోసం అడుక్కుంటున్నారు. సామాన్య ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం సహాయం చేస్తుందా?” అని ప్రశ్నించారు. ఐబొమ్మ రవిని శిక్షించడం కంటే, సినిమా మాఫియాను ఉరి తీస్తే సమాజానికి మేలు జరుగుతుందని ఆయన డిమాండ్ చేశారు.
రవి, హిడ్మాలు పుట్టడానికి వ్యవస్థే కారణం
సమాజంలో లోపాలను సరిదిద్దకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతాయని నారాయణ హెచ్చరించారు.
రవి ఉదంతం: “అద్భుతమైన తెలివితేటలు, సామర్థ్యం ఉన్న ఇమ్మడి రవిలాంటి వారు ఇలా మారడానికి కారణం ఈ వ్యవస్థలే” అని నొక్కి చెప్పారు. వ్యవస్థలో లోపాలను సత్వరమే సరిదిద్దకపోతే, “ఇలాంటి రవిలే పుట్టుకు వస్తారు” అని ఆయన స్పష్టం చేశారు.
హిడ్మా ఎన్‌కౌంటర్: ఇదే తరహాలో మావోయిస్టు నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై స్పందిస్తూ, “ఒక హిడ్మాను చంపితే వెయ్యి మంది హిడ్మాలు పుడతారు” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యక్తిగత నేరాలను లేదా చర్యలను విమర్శించడం కంటే, వాటికి దారి తీస్తున్న సామాజిక-ఆర్థిక అసమానతలు, ప్రభుత్వ విధానాల్లోని లోపాలపై దృష్టి పెట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
