- డంపింగ్ యార్డు రద్దు చేయాల్సిందే
- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ సమీపంలోని సిర్సపల్లి గ్రామంలో ప్రతిపాదించిన వెస్ట్ టు ఎనర్జీ (WTE) డంపింగ్ యార్డు ప్రాజెక్టుపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు అమలు వల్ల పరిసర ప్రాంతాల్లో 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో గాలి, నీరు, ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. దీని ప్రభావంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ప్రభుత్వం డంపింగ్ యార్డు నిర్మాణానికి ముందుకు సాగడం తగదని ఆయన విమర్శించారు. ప్రాజెక్టు అమలైతే పంటలు, పశుసంపద, వృక్ష సంపదకు కూడా ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. పాలు, మాంసం, కూరగాయలు వంటి ఆహార పదార్థాలు కాలుష్యానికి గురై ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పాడి పంటలతో అభివృద్ధి చెందిన ఈ ప్రాంత ప్రజలు వలస వెళ్లే పరిస్థితి తలెత్తవచ్చని ఆయన పేర్కొన్నారు. గత 10 రోజులుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రజలు స్వచ్ఛందంగా నిరసనలు కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని అన్నారు.
డంపింగ్ యార్డు ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని గురువారం పరిశీలించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 3వ తేదీన హుజూరాబాద్ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రజలంతా బంద్‌కు సహకరించాలని ఆయన కోరారు.