- అడ్డగించి బెదిరింపులు.. ఫోన్‌పే ద్వారా డబ్బుల దోపిడీ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిపై దాడి చేసి నగదు, బంగారు ఉంగరం దోచుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం తూర్పాయగూడెంకు చెందిన నల్లమల్ల ఆంజనేయులు (45) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ నెల 20న ఆవుల రాములు అనే వ్యక్తి ఆటో ట్రాలీని కిరాయికి తీసుకొని పెద్దపల్లి జిల్లా పొత్కపల్లికి వెళ్లి మూడు ఎడ్లను కొనుగోలు చేశారు. అనంతరం వాటిని ఆటో ట్రాలీలో ఎక్కించుకొని తిరిగి గ్రామానికి బయలుదేరారు.
ఈ క్రమంలో రాత్రి సమయంలో జమ్మికుంట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకోగానే సుమారు 11 మంది గుర్తుతెలియని వ్యక్తులు ఆటో ట్రాలీని అడ్డగించి, “ఎడ్లను దొంగతనంగా తీసుకొస్తున్నారా” అంటూ ఇద్దరినీ కిందికి దింపి దాడికి పాల్పడ్డారు. అనంతరం వారిని FCI గోదాం సమీపంలోని మేకల మార్కెట్ వద్దకు తీసుకెళ్లి బెదిరింపులకు గురిచేసి ఫిర్యాదిదారుడి వద్దనున్న రూ.8 వేల నగదును లాక్కొన్నారు. అలాగే సెల్‌ఫోన్ తీసుకొని ఫోన్‌పే ద్వారా మరో రూ.3 వేలును తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇంతటితో ఆగకుండా ఫిర్యాదిదారుడి చేతికి ఉన్న అర తులం బంగారు ఉంగరాన్ని కూడా అపహరించగా, డ్రైవర్ ఆవుల రాములును కొట్టి అతని వద్దనున్న రూ.1,000 నగదుతో పాటు ఫోన్‌పే ద్వారా మరో రూ.6 వేలును తీసుకున్నట్లు సమాచారం. అనంతరం ఇంకా లక్ష రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తూ రైల్వే స్టేషన్ వైపు తీసుకెళ్తుండగా బాధితులు అరవడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది.
ఈ ఘటనలో మొత్తం రూ.38 వేల విలువైన నగదు, బంగారు ఉంగరం దోపిడీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.