- కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తున్న టెండర్ యజమాని..?

సైదాపూర్/ధనధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన మొక్కజొన్న రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ పది రోజుల్లో మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, స్థానిక టెండర్ యజమాని నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో సంచుల కొరత కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోజులు గడుస్తున్నా పంట కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగడం లేదని వాపోతున్నారు. “మీ గ్రామానికి సంచులు ఇవ్వం.. మక్కలు ఎప్పుడు తీసుకుంటామో తెలియదు.. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి” అంటూ టెండర్ యజమాని దురుసుగా మాట్లాడుతున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రోణి కార్తి ప్రారంభమైన నేపథ్యంలో రైతులు పంటను త్వరగా విక్రయించాలని భావిస్తున్నా, కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు అధికారులు రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు నిర్వహించాలని చెబుతుండగా, మరోవైపు టెండర్ యజమాని వ్యవహార శైలి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల్లో సంచులు అందుబాటులో ఉంచి మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.