
సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 1: పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. సైదాపూర్ మండల మాజీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రేగుల సుమలత అశోక్ మాట్లాడుతూ, తమ పదవీకాలంలో గ్రామ అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. పనులు పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు బిల్లులు చెల్లించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
పెండింగ్ బిల్లుల చెల్లింపును కోరుతూ శాంతియుతంగా నిరసనకు వెళ్తున్న తమను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. అరెస్టులతో తమ ఉద్యమాన్ని అణచలేరని, ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు తాటిపల్లి యుగంధర్ రెడ్డి, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.