మరమ్మతులకు నోచుకోని తుమ్మలచెరువు కట్టు కాలువ

  • వెంటనే మరమ్మతులు చేపట్టాలని రైతుల డిమాండ్

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 4: సైదాపూర్ మండలంలోని తుమ్మలచెరువు కట్టు కాలువ గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు రెండు చోట్ల దెబ్బతిన్నప్పటికీ ఇప్పటివరకు మరమ్మతులకు నోచుకోలేదని వెంకేపల్లి గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు మునుపాల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు.

గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రానున్న వర్షాకాలానికి ముందే చెరువు కట్టు కాలువకు మరమ్మతులు చేపట్టకపోతే భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉందన్నారు. మరోసారి భారీ వర్షాలు కురిస్తే తుమ్మలచెరువు కట్ట పూర్తిగా తెగిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.



దీంతో సైదాపూర్, జాగిరిపల్లి, ఆరేపల్లి, బూడిదపల్లి, సోమారం గ్రామాలకు చెందిన వ్యవసాయ భూములు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కట్టు కాలువ తెగిపోయిన రెండు ప్రాంతాల్లో మట్టి, రాళ్లతో అడ్డుకట్ట వేసి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరారు.

అలాగే చెరువు కట్టపై ఇరువైపులా తుమ్మచెట్లు విస్తరించి ఉండటంతో రైతులు కనీసం నడవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు చెట్లను తొలగించి చెరువు కట్టను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.



రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి తుమ్మలచెరువు కట్టు కాలువ మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని మునుపాల శ్రీనివాస్ కోరారు.

Leave a comment