సిద్ధిపేట, జులై 3(ధనాధన్ న్యూస్): ఇల్లు కట్టడం అంటే ఇటుకలు, సిమెంట్‌తో పాటు అప్పులూ ఉంటాయనే విషయాన్ని ఓ వ్యక్తి వినూత్నంగా, హాస్యభరితంగా చెప్పేశాడు. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన ఓ వ్యక్తి, ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఫొటోతో ప్రత్యేక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఫ్లెక్సీలో బ్రహ్మానందం హావభావాలతో పాటు పెద్ద అక్షరాల్లో “అప్పు చేసి కడుతున్న బ్రో…” అని రాయించడంతో అటుగా వెళ్లేవారు ఆగి చదివి నవ్వుకుంటున్నారు. కొందరు సెల్ఫీలు తీసుకుంటుండగా, మరికొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి సరదా మీమ్స్, రీల్స్, డైలాగులు తరచూ కనిపిస్తున్నా… వాటిని నేరుగా ఇంటి నిర్మాణ ఫ్లెక్సీపై ముద్రించడం మాత్రం అరుదేనని స్థానికులు చెబుతున్నారు.

ఈ వినూత్న ఆలోచన ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. “ఇల్లు కట్టడం కంటే అప్పు తీర్చడమే పెద్ద ప్రాజెక్ట్” అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి, ఈ ఫ్లెక్సీ దుబ్బాకలో నవ్వులు పూయిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

Leave a Reply