కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న జాతీయ విద్యావిధానాన్ని నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద అఖిల భారత విద్యా హక్కు ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాలో పాల్గొనేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర,జిల్లా నాయకత్వం శుక్రవారం రోజున బయలుదేరివెల్లింది.శుక్రవారం ఉదయం 46 మంది సభ్యులతో కూడిన డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ బృందం రామగుండం లో ఆంధ్రప్రదేశ్ ఎక్స్ ప్రెస్ రైల్లో వెళ్లారు.డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైద్యుల రాజిరెడ్డి,రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎం.రఘుశంకర్ రెడ్డి,రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పల్కల ఈశ్వర్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు ఆవాల నరహరి,జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతి,జిల్లా కార్యదర్శి ఎబూసి శ్రీనివాస్,
రాంకిరణ్, రామ్మోహన్,సుదర్శన్ రెడ్డి తదితరులు ఈ బృందంలో వున్నారు.2020 నుండి కేంద్రప్రభుత్వం అమలు పరుస్తున్న జాతీయ విద్యావిధానాన్ని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకించడమే గాకుండా, పూర్తిగా ప్రభుత్వరంగంలో కొనసాగించవలసిన విద్యను ప్రైవేటికరిస్తూ,కాషాయీ కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తున్న విషయం తెలిసింది.జాతీయ స్థాయిలో అఖిలభారత విద్యా హక్కు ఫోరమ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న పోరాటంలో భాగంగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేష క్రియాశీల ఉద్యమాలను నిర్వహిస్తున్నది.
