- కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
కరీంనగర్/ధనాధన్ న్యూస్, సెప్టెంబర్ 4 : హుజురాబాద్ డివిజన్ పరిధిలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు.
హుజురాబాద్ ఏసీపీ కార్యాలయంలో పోలీస్, విద్యుత్, వైద్య, మున్సిపల్, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
కమిషనర్ మాట్లాడుతూ, నిమజ్జన ప్రదేశాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని, బారికేడ్లు, సరైన లైటింగ్, క్రేన్లు, అదనపు డ్రైవర్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల కోసం ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు, లైఫ్ బోయ్స్, మొబైల్ బైక్‌లు సిద్ధంగా ఉంచాలని ఫైర్ అధికారులకు సూచించారు.
వైద్య అధికారులు నిమజ్జన ప్రదేశాల్లో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి, అంబులెన్స్‌ను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఊరేగింపు మార్గాల్లో, నిమజ్జనం పూర్తయ్యే వరకు విద్యుత్ శాఖ అధికారులు అందుబాటులో ఉండి విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగించేలా చూడాలని పేర్కొన్నారు.
తరువాత ఆయన హుజురాబాద్‌లోని కాకతీయ కాలువ, జమ్మికుంటలోని నాయిని చెరువు నిమజ్జన ప్రదేశాలను పరిశీలించి, అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జి, ఇన్స్పెక్టర్లు కరుణాకర్, రామకృష్ణ, లక్ష్మీనారాయణ, వెంకట్‌తో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
