పెన్షనర్ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు:దాసరి రాజేశ్వర్ ధ్వజం

By dhanadhannews.com

  • జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో ‘పెన్షన్ రక్షణ దినోత్సవం’
  • 8వ వేతన సంఘంపై కీలక డిమాండ్లు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్, డిసెంబర్ 17:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల పెన్షనర్ల హక్కులు హరించుకుపోతున్నాయని రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జమ్మికుంట బ్రాంచ్ ప్రెసిడెంట్, AIRRF సీఈసీ సభ్యులు దాసరి రాజేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. AIRF, NCCCIPA, AISCCON సంఘాల పిలుపు మేరకు బుధవారం జమ్మికుంట రైల్వే స్టేషన్ ఆవరణలో ‘పెన్షనర్స్ డే’ను బహిష్కరించి, ప్రభుత్వ తీరుకు నిరసనగా ‘పెన్షన్ రక్షణ దినోత్సవాన్ని’ శాంతియుతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పెన్షనర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ధర్నా చేపట్టారు. దాసరి రాజేశ్వర్ మాట్లాడుతూ, 1982 డిసెంబర్ 17న సుప్రీంకోర్టు పెన్షనర్ల హక్కులను గుర్తిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం తీసుకువచ్చిన ‘వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ 2025’ పెన్షనర్లందరికీ పెను శాపంగా మారబోతోందని ఆయన హెచ్చరించారు.


ప్రభుత్వం ముందు పెట్టిన ప్రధాన డిమాండ్లు:
•వివాదాస్పద రూల్స్ రద్దు: పెన్షనర్లకు హానికరంగా ఉన్న ‘వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ 2025’ను తక్షణమే రద్దు చేయాలి.
•8వ వేతన సంఘం సవరణలు: 2026కు ముందు రిటైర్ అయిన వారందరికీ పెన్షన్ సవరణ ప్రయోజనాలను తప్పనిసరిగా వర్తింపజేయాలి.
•నిధుల సాకు చూపొద్దు: 8వ సిపిసి TOR నుంచి ‘నిధులు లేని ఖర్చు’ (నాన్-కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాలపై క్లాజ్ F-III) అనే అంశాన్ని తొలగించాలి.
•పెన్షన్ ఫండ్ రక్షణ: ప్రస్తుతం ఉన్న రూ. 10 లక్షల కోట్ల పెన్షన్ ఫండ్‌ను కేవలం పెన్షనర్ల సంక్షేమం కోసమే వాడాలి, దానిని పటిష్టంగా కాపాడాలి.
•అమలు తేదీ ఖరారు: 8వ వేతన సంఘం అమలు తేదీని జనవరి 1, 2026గా నిర్ణయించాలి.
•ప్రాతినిధ్యం కల్పించాలి: 8వ సిపిసి చర్చల యంత్రాంగంలో SCOVA సభ్యులను భాగస్వామ్యం చేయాలి.


ఈ నిరసన కార్యక్రమంలో జమ్మికుంట బ్రాంచ్ సెక్రటరీ శీలం మల్లేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ టంగుటూరి వెంకటస్వామి, బంగారి విద్యాసాగర్, వైస్ ప్రెసిడెంట్లు ఖాజా మొయినుద్దీన్, పర్ష రాములు, సమ్మయ్య, ట్రెజరర్ ఎండి. ఖాదర్ ఖాన్ పాల్గొన్నారు. అలాగే తప్రా అధ్యక్షులు గరిగే చంద్రయ్య, సెక్రటరీలు ఎస్. రాజయ్య, సారంగపాణిలతో పాటు పెద్ద సంఖ్యలో పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని సంఘీభావం తెలిపారు.