
కరీంనగర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం తీవ్రంగా ఖండించారు.
జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ద్వారా విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఆయన మాట్లాడుతూ, రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించాలని సూచించారు. వ్యక్తిగత ఆరోపణలు, ఉద్రిక్తతలకు దారితీసే వ్యాఖ్యలు మానుకోవాలని కౌశిక్ రెడ్డికి హెచ్చరిక చేశారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగించే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ సహించదని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గతంలో పలుమార్లు కాంగ్రెస్ నేతలు, మంత్రులు, అధికారులపై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇకపై అలాంటి వ్యవహారాలను ఉపేక్షించబోమని అన్నారు.
అలాగే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర నాయకులు కూడా బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల అనవసర ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.
అధికారం కోల్పోయిన నిరాశతో బీఆర్ఎస్ నాయకులు అసహనంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించిన డా. మేడిపల్లి సత్యం, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా రాజకీయాలు సాగాలని అన్నారు. రాజకీయాలలో పరస్పర గౌరవం అవసరమని, అనుచిత భాషను నివారించాలని హితవు పలికారు.