16నెలలుగా ఫైల్ పెండింగ్..!డిపివోపై ఫిర్యాదు

  • అధికారుల ఆదేశాలకూ స్పందన లేదంటూ ఆరోపణలు
  • జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన చుక్క గంగరాజం

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 2:
జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి (డిపివో) చీకోటి మదన్ మోహన్ గత 16 నెలలుగా నివేదిక సమర్పించకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ కోరుట్లకు చెందిన చుక్క గంగారాజం సోమవారం జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ 2025 సెప్టెంబర్ నెలలో జారీ చేసిన ఆదేశాలను సైతం జిల్లా పంచాయతీ అధికారి బేఖాతర్ చేశారని ఆయన ఆరోపించారు.


ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన చుక్క గంగారాజం, కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిపై 2025 మార్చి 3న జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం కోరుట్ల ఎంపీవో విచారణ నిర్వహించి సంబంధిత పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.


పంచాయతీ కార్యదర్శి నుండి సంజాయిషీ స్వీకరించిన అనంతరం చట్టపరమైన చర్యల కోసం జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించాల్సి ఉన్నప్పటికీ, డిపివో చీకోటి మదన్ మోహన్ ఇప్పటి వరకు ఎలాంటి నివేదికను సమర్పించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.


ఈ విషయమై అనేకసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, ప్రత్యక్షంగా డిపివోను కలిసినా ఎలాంటి ఫలితం లేకపోయిందని చుక్క గంగారాజం ఆవేదన వ్యక్తం చేశారు. డిపివో చేస్తున్న జాప్యంపై తనకు పలు అనుమానాలు కలుగుతున్నాయని, వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన కోరారు.

Leave a comment