ప్రజా భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం

  • ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి

వికారాబాద్/ధనాధన్ న్యూస్,జూన్ 06: వికారాబాద్ పట్టణంలోని అనంతగిరిపల్లి 10వ వార్డులో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యాన్ని నిర్ధారించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.వార్డు సభల ద్వారా స్థానిక సమస్యలను గుర్తించడం, అభివృద్ధి పనులను సూచించడం, సమగ్ర వార్డు అభివృద్ధి ప్రణాళిక రూపొందించడంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. వార్డు ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువత, వృద్ధులు తదితరులు తమ విలువైన సూచనలు అందించి వార్డు అభివృద్ధికి సహకరించాలని కోరారు.


ఈ సందర్భంగా వర్షాకాల సన్నద్ధత కార్యాచరణ ప్రణాళిక, మురుగు కాల్వల పూడికతీత, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రహదారులు మరియు వీధి దీపాల నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ, ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ, మొక్కల పెంపకం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.ఘన వ్యర్థాల వల్ల కలిగే పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రజలు తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు, శానిటరీ వ్యర్థాలు, ప్రత్యేక జాగ్రత్త వ్యర్థాలను వేర్వేరుగా నిల్వ చేసి స్థానిక సంస్థల సూచనల మేరకు వ్యర్థ సేకరణదారులకు అప్పగించాలని సూచించారు. ఉపయోగించిన శానిటరీ వ్యర్థాలను ప్రత్యేకంగా చుట్టి ప్రత్యేక బిన్లలో వేయాలని తెలిపారు.


తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టబడిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల చురుకైన భాగస్వామ్యం, సహకారం అత్యంత అవసరమని అన్నారు.
పారిశుద్ధ్యం, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఓటరు అవగాహన, పౌర బాధ్యతల పట్ల ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉంటే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, సురక్షితమైన మరియు సుస్థిరమైన మున్సిపాలిటీని నిర్మించగలమని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు ఆఫీసర్ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగం, రెడ్డి శేఖర్, రెడ్డి నందు, బాగయ్య, శ్రీను, ఉంగూరు రాము తదితరులు పాల్గొన్నారు.

Leave a comment