- అండగా నిలిచిన హుస్నాబాద్ గురుకుల పూర్వ విద్యార్థులు

హుస్నాబాద్/ధనాధన్ న్యూస్,జూన్ 7: స్నేహం అంటే కేవలం కలిసి చదవడం, కలుసుకోవడం మాత్రమే కాదని, కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలవడమేనని హుస్నాబాద్ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు మరోసారి నిరూపించారు.సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన బొడిగ తిరుపతి గత నెల 24న అనారోగ్యంతో అకాల మరణం చెందగా,ఆయన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు తోటి పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు.
1996–2016 మధ్య హుస్నాబాద్ గురుకుల పాఠశాలలో తిరుపతితో కలిసి చదువుకున్న స్నేహితులు నిజాం కళాశాల ప్రొఫెసర్ వేల్పుల కుమార్ ఆధ్వర్యంలో ఏకమై రూ.50 వేల ఆర్థిక సాయాన్ని సేకరించారు. ఆ మొత్తాన్ని తిరుపతి కుమార్తె అక్షర పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేసి, సంబంధిత పత్రాలను ఆదివారం కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, స్నేహితుడి కుటుంబానికి తమవంతు బాధ్యతగా ఈ సాయం అందిస్తున్నామని తెలిపారు. దశాబ్దాల క్రితం పాఠశాలలో ఏర్పడిన స్నేహబంధం నేటికీ కొనసాగుతూ, కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కోటేష్, సత్యం, వంశీ, కమల్, శ్రీనివాస్, దాట్ల ప్రవీణ్‌తో పాటు హుస్నాబాద్ గురుకుల పూర్వ విద్యార్థుల బృందం పాల్గొన్నారు.