- ఇల్లందకుంటలో సీసీ కెమెరాల ప్రారంభం-వనమహోత్సవంలో మొక్కలు నాటిన సీపీ – విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ – పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాల వార్షిక తనిఖీలు

కరీంనగర్,జూలై 21 (ధనాధన్ న్యూస్): ప్రజల సహకారంతోనే సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమవుతుందని, ప్రజా భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అన్నారు. మంగళవారం ఇల్లందకుంట మండలంలో పర్యటించిన ఆయన ప్రజా భద్రత, పర్యావరణ పరిరక్షణ, రోడ్డు భద్రత, విద్యార్థుల అవగాహన, పోలీసింగ్ బలోపేతానికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.మొదట ఇల్లందకుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా నిఘా వ్యవస్థను సీపీ ప్రారంభించారు. గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, కేసుల దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటును విస్తరించాలని సూచించారు.

అనంతరం వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, నేడు నాటే మొక్కలే రేపటి తరాలకు జీవనాధారమవుతాయని విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా అత్యవసర పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్లు ముద్రించిన ఎగ్జామ్ ప్యాడ్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యతో పాటు భద్రతపై కూడా అవగాహన కలిగి ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేసిన సీపీ, హెల్మెట్ ధరించడం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాకుండా ప్రాణరక్షణకు అత్యంత అవసరమని తెలిపారు.

అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, పోలీస్–ప్రజల సమన్వయంతోనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని అన్నారు. గ్రామాల్లో మాదకద్రవ్యాల విక్రయాలు, జూదం, సైబర్ మోసాలు, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఇతర అక్రమ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
పర్యటనలో భాగంగా ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ నిర్వహించిన సీపీ, కిట్ ఇన్స్పెక్షన్, పెండింగ్ కేసులు, కోర్ పోలీసింగ్, చట్ట అమలు, క్రైమ్ వెహికల్స్, క్రైమ్ ప్రాపర్టీ, రికార్డులు, ప్రభుత్వ ఆస్తులు, కేసుల దర్యాప్తు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో వేగం పెంచడంతో పాటు నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ప్రతిపాదిత ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందేలా నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
తదుపరి జమ్మికుంట రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ, పెండింగ్ ఫైళ్లు, రికార్డులు, ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయ నిర్వహణ, పోలీసింగ్ పనితీరును సమీక్షించారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమాల్లో హుజూరాబాద్ ఏసీపీ మాధవి, హుజూరాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, జమ్మికుంట రూరల్ ఇన్స్పెక్టర్ వెంకట్, ఇల్లందకుంట ఎస్సై ఎం. క్రాంతికుమార్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.
