- రైతులకు సాగునీరు లేదు.. చెరువుల్లో చుక్కనీరు లేదు.. పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదు
- చాడ ప్రకాష్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్,రాయికల్

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్, చిగురుమామిడి మండలాలను వెంటనే కరువు మండలాల జాబితాలో చేర్చి, మెట్ట ప్రాంత రైతులను ఆదుకోవాలని సింగిల్ విండో డైరెక్టర్ చాడ ప్రకాష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సరైన సాగునీటి సౌకర్యాలు లేక, వర్షాభావ పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లోని అనేక గ్రామాలకు పూర్తిస్థాయిలో కాలువల ద్వారా సాగునీరు అందడం లేదని తెలిపారు. దీంతో ఈ ప్రాంత రైతులు బోర్లు, వ్యవసాయ బావులపైనే ఆధారపడి సాగు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో సరైన వర్షాలు కురవకపోవడంతోపాటు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవడంతో పంటలను కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారిందన్నారు. పంట కోతల సమయానికి కనీసం సగం దిగుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని, పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
యాసంగి సీజన్లోనూ రైతులు రాత్రింబవళ్లు బోర్లు, బావుల వద్దే గడుపుతూ, స్టార్టర్ల దగ్గర పడుకొని పైపులు మారుస్తూ పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారని వివరించారు. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోవడంతోపాటు చెరువులు, కుంటల్లో నీరు లేకపోవడం వల్ల వ్యవసాయం మరింత సంక్షోభంలో పడిందన్నారు.సాగునీటి వసతులు సరిగా లేని తమ ప్రాంత రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం, కరువు మండలాల గుర్తింపు విషయంలోనూ నిర్లక్ష్యం వహిస్తోందని చాడ ప్రకాష్ రెడ్డి విమర్శించారు. కొన్ని ప్రాంతాలకు సాగునీరు, విద్యుత్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, తమ ప్రాంత రైతులు మాత్రం బోర్లు, బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సైదాపూర్, చిగురుమామిడి మండలాలను కరువు మండలాల జాబితాలో చేర్చకపోవడం ఈ ప్రాంత రైతాంగానికి తీరని అన్యాయమని అన్నారు.మంత్రి, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వాస్తవ పరిస్థితులను పరిశీలించి, సైదాపూర్, చిగురుమామిడి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రైతులతో కలిసి మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. మండలాలను కరువు మండలాలుగా గుర్తించేంతవరకు గ్రామగ్రామాన రైతులతో నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.
