- పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఘన సన్మానం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆకునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను గురువారం ఘనంగా సన్మానించారు. తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మండ్ల భాస్కర్ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారికి, వారి తల్లిదండ్రులకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. ఆకునూరు పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తుండటం గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో గడ్డం శివసాయి 530 మార్కులతో పాఠశాల ప్రథమ ర్యాంకు సాధించగా, రాయిశెట్టి రాహుల్ 525 మార్కులతో ద్వితీయ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. అలాగే ఎర్రల సాయిచరణ్ 514, నెల్లి అక్షయ 513, పెద్ది సాత్విక 508, రాయిశెట్టి సిరిచందన 502 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారని చెప్పారు.
మరోవైపు బొడిగె లహరి, మౌటం చైతన్య నాగవైష్ణవి, సోతుకు రామచరణ్, వరలక్ష్మి, భక్తుల అక్షయ్ తదితరులు 500 మార్కులకు సమీపంలో నిలిచారని వివరించారు.విద్యార్థులు విద్యలోనే కాకుండా వాలీబాల్ క్రీడల్లో కూడా రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారని హన్మండ్ల భాస్కర్ తెలిపారు. గడ్డం శివసాయి, రాయిశెట్టి రాహుల్, పెద్ది సాత్విక, బత్తుల అక్షయ్ తదితరులు రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు.
ఆకునూరు పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించాలని ఆయన కోరారు. విద్యార్థులను ప్రోత్సహించే ఇలాంటి సన్మానాలు వారికి మరింత ఉత్సాహాన్ని అందిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో రచయిత మండల జంపయ్య, గడ్డం స్వప్న, బోయిని అభిషేక్ వర్మ, గాజుల శివాజీ, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.