- ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ని కలిసిన ప్రణవ్ బాబు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ పట్టణ పరిధిలో ప్రతిపాదిత డంప్ యార్డ్ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేమ్ నరేందర్ రెడ్డిని కలిసి ఈ విషయంపై మరొక్కసారి వినతి పత్రం అందజేశారు.
సిర్సపల్లి శివారులో ఏర్పాటు చేయాలని భావిస్తున్న డంప్ యార్డ్ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. ఈ ప్రాజెక్ట్ వల్ల స్థానిక ప్రజలకు కలిగే ఇబ్బందులు, వ్యవసాయంపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించారు. ఈ ప్రాంతం పూర్తిగా వ్యవసాయాధారితమైందని, వ్యర్థాల వల్ల పంట పొలాలకు నష్టం వాటిల్లే అవకాశముందని పేర్కొన్నారు.
జనావాసాల మధ్య ఈ విధమైన ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడం సరైనది కాదని, దీనిని ఇతర అనుకూల ప్రాంతానికి తరలించాలని సూచించారు. ఈ అంశంపై వారంలోనే రెండోసారి ప్రభుత్వ సలహాదారును కలిసినట్లు ప్రణవ్ తెలిపారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ప్రస్తుత ప్రతిపాదనపై ముందుకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.