ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వెంకటేశ్వర్లపల్లిలో గ్రామ సభ

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ రాయిచెట్టి చంద్రయ్య ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ రాయిచెట్టి చంద్రయ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామానికి తాజాగా 27 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. అలాగే వితంతు, వికలాంగులు, వృద్ధాప్య పింఛన్లు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.


రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల ప్రకారం పదవ తరగతి నుండి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు టిఫిన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని హామీ ఇచ్చారు.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ఐదు కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా వర్తిస్తుందని తెలిపారు. వ్యవసాయ భూమి ఉన్నా లేకపోయినా కుటుంబ యజమాని మరణించిన పక్షంలో ఈ బీమా వర్తిస్తుందని వివరించారు.
స్పెషల్ ఆఫీసర్ ఏపీఎం తిరుపతి మాట్లాడుతూ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల రూపంలో ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. మొత్తం 20 గ్రూపులు రూ.1.16 కోట్ల రుణం పొందగా, అందులో 15 గ్రూపులు రూ.6.11 లక్షలు వినియోగించుకున్నట్లు చెప్పారు.


ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సులోచన, కార్యదర్శి కొండల్ రెడ్డి, వార్డు సభ్యులు వేముల సుమలత, బత్తుల మోహన్, బత్తుల స్రవంతి, ఎర్రల శంకర్, గుర్రం కుమారస్వామి, దయ్యాల శ్రీనివాస్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏఎన్ఎం స్వర్ణలత, ఆశ వర్కర్ ఎర్రల శ్యామల, అంగన్వాడీ టీచర్ అమరావతి, స్కూల్ టీచర్ విష్ణు, లైన్మెన్ శ్రీకాంత్, మహిళా సంఘం సభ్యులు మరియు గ్రామ ప్రజలు హాజరయ్యారు.

Leave a comment