హుజూరాబాద్, జూలై 23 (ధనాధన్ డిజిటల్ న్యూస్): కరీంనగర్ జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న హత్యలు, దోపిడీలు, చోరీలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, జిల్లా పోలీసు వ్యవస్థ శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల కరీంనగర్ భగత్‌నగర్‌లో ఓ కుటుంబాన్ని ఆయుధాలతో బెదిరించి, తాళ్లతో బంధించి 72 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.21 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను దుండగులు దోచుకెళ్లిన ఘటన జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందన్నారు.అంతకుముందు జరిగిన పీఎంజే జ్యువెలరీ దోపిడీ, హుజూరాబాద్‌లో మామిండ్లవాడ మహిళ హత్య, మెడికల్ షాప్ ఎదుట బైక్ చోరీ, నిర్వాణ హోటల్, అన్నపూర్ణ థియేటర్ పరిసరాల్లో వరుస దొంగతనాలు, అలుగునూరు వద్ద న్యాయవాదిపై హత్యాయత్నం వంటి ఘటనలు పోలీసుల పనితీరుపై అనేక సందేహాలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌస్ ఆలం నేరాలను ముందస్తుగా అరికట్టడంలో విఫలమవుతున్నారని, ఘటనలు జరిగిన తర్వాత మాత్రమే మీడియా సమావేశాలు నిర్వహించడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దలేమని విమర్శించారు.సంచలన కేసుల్లో ఇప్పటికీ ప్రధాన నిందితులను అరెస్టు చేయకపోవడం ఆందోళనకరమని, అసలు నేరస్తులను పట్టుకునే బదులు కేసులను పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరస్తులకు భయం లేకుండా పోయిందని, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలీసు వ్యవస్థ బలహీనపడిందని ఆయన విమర్శించారు.హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలు, ఆస్తులకు పూర్తి భద్రత కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నేరస్తులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం, పోలీసు శాఖను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.అలా చేయకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, జిల్లాలో జరిగే ప్రతి నేర ఘటనకు ప్రభుత్వం, పోలీసు శాఖే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

Leave a Reply