హనుమకొండ, జూలై 6 (ధనాధన్ న్యూస్):
ఎల్కతుర్తి మండలం భవిష్యత్తులో అభివృద్ధిలో మరింత ముందంజలో నిలుస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి జంక్షన్ వద్ద మడిపల్లి నుంచి ఎల్కతుర్తి జంక్షన్ వరకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (KUDA) ఆధ్వర్యంలో రూ.13 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రహదారి నిర్మాణం పూర్తయితే గ్రామాలకు మండల కేంద్రంతో మెరుగైన అనుసంధానం ఏర్పడి ప్రజల రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు. ఎల్కతుర్తి మండల కేంద్రానికి కోర్టు, విద్యుత్ ఉపకేంద్రం, తహసీల్దార్ కార్యాలయం వంటి ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు కానున్నాయని, దీంతో మండలం సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందన్నారు.ఈ రహదారి నిర్మాణం కోసం KUDA ఛైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు. ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజల విజ్ఞప్తి మేరకే ఈ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.

పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనులకు ప్రజలు సహకరించాలని కోరారు.KUDA ఛైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి మాట్లాడుతూ, ఈ రహదారి నిర్మాణంతో గ్రామాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడి, ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, KUDA ఛైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, KUDA సీపీవో అజిత్ రెడ్డిలను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
తర్వాత ఎల్కతుర్తి–దామెర ప్రధాన రహదారిని మంత్రి, జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మరమ్మతులు, అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి సర్పంచ్ లావణ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజీ, ఉప సర్పంచ్ రాజు, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, KUDA సీపీవో అజిత్ రెడ్డి, ఈఈ భీమ్‌రావు, తహసీల్దార్ ప్రసాదరావు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply