- గర్భిణి స్త్రీలకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన

సైదాపూర్/ధనధాన్ న్యూస్,ఏప్రిల్ 25:
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెంకేపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐసిడిఎస్ సీడీపీవో ఎం. సుగుణ మాట్లాడుతూ, ప్రీ-స్కూల్ మేళ, గర్భిణి స్త్రీల కోసం శ్రీమంతం కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించామని తెలిపారు. అలాగే ఆరు నెలలు నిండిన శిశువులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడంతో పాటు, చిన్నారుల కోసం గ్రాడ్యుయేషన్ డేను కూడా విజయవంతంగా జరిపినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా సూపర్వైజర్ హిమ వర్షా, అంగన్వాడీ టీచర్ల కృషిని సీడీపీవో అభినందించారు. సూపర్వైజర్ హిమ వర్షా మాట్లాడుతూ, గర్భిణి స్త్రీలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఆకుకూరలు, గుడ్లు, చేపలు, మాంసం వంటి పోషకాహారం ఆరోగ్యానికి ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి కుటుంబం ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని, చిన్నారుల ఎదుగుదలకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సునీత, తహసీల్దార్ శ్రీనివాస్, సీడీపీవో సుగుణ, సూపర్వైజర్ హిమ వర్షా, అంగన్వాడీ టీచర్లు, గర్భిణి స్త్రీలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.