మహనీయుల జయంతులను ఘనంగా నిర్వహించాలి

  • దళిత రత్న వడ్డూరి కుమారస్వామి పిలుపు

హుజూరాబాద్/ధనాధన్ న్యూస్: ఏప్రిల్ నెలను “మహనీయుల పండగ నెల”గా గుర్తించి, వారి జయంతులను ఘనంగా నిర్వహించాలని దళిత రత్న వడ్డూరి కుమారస్వామి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ఏప్రిల్ నెల అంటే కేవలం ‘ఏప్రిల్ ఫూల్’ మాత్రమే కాదు, దేశ చరిత్రలో చిరస్మరణీయులైన మహనీయులు జన్మించిన గొప్ప నెల” అని పేర్కొన్నారు.


భారతదేశానికి విశేష సేవలు అందించిన మహానుభావులలో, అగ్రవర్గ ఆధిపత్యాన్ని ఎదిరించి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చిన ప్రముఖ నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ 5న జరుపుకుంటామని తెలిపారు. చిన్న వయస్సులోనే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి సుమారు 27 సంవత్సరాలు ప్రజాసేవ చేసిన ఆయనను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
అలాగే, సామాజిక సంస్కరణలకు పునాది వేసిన మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఏప్రిల్ 11న జరుపుకుంటామని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు.


భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న జరుపుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తూ సమానత్వాన్ని స్థాపించిన మహనీయుడిగా అంబేద్కర్ గారి సేవలను గుర్తుచేసుకున్నారు.
ఇలాంటి గొప్ప మహనీయులు జన్మించిన ఏప్రిల్ నెలను పండగ నెలగా భావిస్తూ, ప్రతి జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో వారి జయంతులను ఘనంగా నిర్వహించాలని ఆయన ప్రజలను కోరారు.

Leave a comment