
ఒంగోలు/ధనాధన్ న్యూస్,ఏప్రిల్ 12:
సామాన్య ప్రజలు నివసించే కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల కాలనీల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండగా, సాధారణ ప్రజల కాలనీల్లో మాత్రం రోడ్లు, డ్రైనేజీలు లేక దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని విమర్శిస్తున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలోని జయప్రకాష్ కాలనీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. డ్రైనేజీలు లేకపోవడం, సీసీ రోడ్లు దెబ్బతినడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం సమయంలోనూ, ప్రస్తుతం టిడిపి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ సమస్యలపై ఎలాంటి శాశ్వత పరిష్కారం కనిపించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే మున్సిపాలిటీ అధికారులు చెత్త సేకరణకు సక్రమంగా రాకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు. అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడం బాధాకరమని తెలిపారు.
ఇటీవల మహిళలపై పెరుగుతున్న నేరాల నేపథ్యంలో కాలనీల్లో భద్రతా చర్యలు బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే నేరాలను నియంత్రించడంలో కొంతమేర సహాయపడుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాత్రి సమయంలో మహిళలు భయాందోళనల మధ్య సంచరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకొని కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని ఇంటర్నేషనల్ న్యూ విజన్ ఫౌండేషన్ మరియు డి ఎస్ ఆర్ న్యూస్ ఛానల్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా డి ఎస్ ఆర్ న్యూస్ ఛానల్ చైర్మన్ కుర్ర రంగ నాయక్ నాని, సాత్విక అమ్ములు, అలాగే ఇంటర్నేషనల్ న్యూ విజన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుర్ర విజయ్ భాయ్, పొట్ట మధు, సుధీర్ తదితరులు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.