- కురుమల ఖాతాల్లో రూ.2 లక్షలు జమ చేయాలి
- కురుమ సంఘం యూత్ అధ్యక్షుడు మునిపాల శ్రీనివాస్

సైదాపూర్/ధనాధన్ న్యూస్: రాష్ట్రంలోని గొల్ల, కురుమల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచిన గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం తిరిగి ప్రారంభించాలని మండల కురుమ సంఘం యూత్ అధ్యక్షుడు మునిపాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీపై గొర్రెల యూనిట్లు పంపిణీ చేయడంతో వేలాది కుటుంబాలు స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేసినట్లు తెలిపారు.
మొదటి విడతలో లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు అందించినప్పటికీ, రెండో విడత అమలు కాకముందే ప్రభుత్వం మారడంతో పథకం నిలిచిపోయిందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండో విడతకు బదులుగా కురుమల ఖాతాల్లో రూ.2 లక్షలు జమ చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే ఇప్పటివరకు ఆ హామీ అమలుపై స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ అనేక కుటుంబాలకు ప్రధాన జీవనాధారమని, ప్రస్తుతం పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో గొర్రెల పంపిణీ పథకాన్ని మళ్లీ అమలు చేస్తే పేద కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. దీంతో యువత ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితులు తగ్గి, గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.
కురుమ సంఘాల ఆశలు, పశుపోషకుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆయన కోరారు.