
హైదరాబాద్/ధనాధన్ న్యూస్,ఏప్రిల్ 17: హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.హుజురాబాద్ ప్రాంతంలో నాలుగు జిల్లాల చెత్తను తరలించి డంపింగ్ యార్డ్ నిర్మించాలన్న ప్రణాళిక ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ వల్ల గాలి, నీరు, భూమి కాలుష్యానికి గురై ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటాయని, వ్యవసాయం నాశనం అవుతుందని, తాగునీరు కలుషితం కావడంతో వివిధ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రజల అభిప్రాయం లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని, వెంటనే దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే ప్రాజెక్ట్‌ను హుజురాబాద్‌లో అమలు చేయడం దురదృష్టకరమని విమర్శించారు.
డంపింగ్ యార్డ్ అంశంపై తాను ఎలాంటి రాజీకి రానని స్పష్టం చేసిన నేపథ్యంలో, తనపై తప్పుడు కేసులు నమోదు చేసి, సీబీసీఐడీ కేసులతో జైలుకు పంపిస్తామని బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. అయినప్పటికీ ప్రజల హక్కులు, ఆరోగ్యం కోసం తన పోరాటం ఆగదని, ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గనని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, అలాగే మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ అంశంపై స్పందించకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజల సమస్యలపై స్పందించకుండా ఉండటం సమంజసం కాదని అన్నారు.
డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ప్రజలందరూ ఒకే వేదికపైకి రావాలని పిలుపునిస్తూ, లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తే ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఈ నెల 22వ తేదీన పాదయాత్ర చేపట్టి ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.డంపింగ్ యార్డ్ ప్రతిపాదన పూర్తిగా రద్దు అయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ ప్రెస్ మీట్‌లో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, గందె శ్రీనివాస్, కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిల్ రమేష్, తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, తిరుపతి రావు, చుక్కా రంజిత్, మాజీ ఎంపీపీ సురేందర్ రెడ్డి, కౌన్సిలర్ రవీందర్ రావు, బచ్చు శివశంకర్, పోడేటి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.