సైదాపూర్,ధనాధన్ న్యూస్:
సైదాపూర్ మండలంలోని ఆకునూర్ క్లస్టర్ పరిధిలోని వివిధ గ్రామాల్లోని రైతుల పొలాల్లో కేవికే జమ్మికుంట కీటక శాస్త్రవేత్త శ్రీనివాస్ ,ఆకునూర్ ఏఈఓ వంశీ తో కలిసి పర్యటించి రైతులకు ఈ క్రింది సూచనలను ను తెలియజేయడం జరిగింది.
యాసంగి వరి లో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు
యాసంగి వరి లో తీవ్రమవుతున్న జింక్ లోపం, సల్ఫైడ్ ధుష్ప్రభావం & మొగి పురుగు ఉదృతి:
జింకు ధాతు లోపం వలన మొక్కలలో పై నుంచి 3 లేదా 4 ఆకుల్లో మధ్య ఈనే పాలి పోతుంది.ఎక్కువ లోపం ఉన్నప్పుడు ముదురాకు చివర్లలో,మధ్య ఈనెకు ఇరుప్రక్కల తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు కనపడుతాయి.ఆకులు చిన్నవిగా, పెళుసుగా మారుతాయి.మొక్కలు గిడసబారి దుబ్బు కూడా చేయవు.నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు.జింక్ లోప సవరణకు ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి లేనిచో ప్రతి రబీ సీజన్ లో, ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి.ప్రత్యామ్నాయoగా 10 కిలోల జింక్ సల్ఫేట్ ను 200-250 కిలోల మాగిన పశువుల పేడ లేదా వర్మికంపోస్ట్ తో కలిపి 20 నుంచి 30 రోజుల పాటు గోనె సంచిలో ఉంచి మగ్గనిచ్చి, ఆ తర్వాత చివరి దుక్కిలో వేయాలి.పైరుపై జింక్ లోపం కనిపించగానే లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్ఫేట్ చొప్పున కలిపి 5 రోజుల వ్యవధిలో 2,3 సార్లు పిచికారి చేయాలి. జింకు సల్ఫేటు ద్రావణంలో పురుగు/తెగుళ్ల మందులను కలుపరాదు. చౌడు నేలల్లో పిచికారి తప్పనిసరి.
సల్ఫైడ్ దుష్ప్రభావం:
వరి నేలల్లో, పంట మధ్య కాలంలో, అక్కడక్కడ గుంపులు గుంపులుగా బాగా పెరిగిన పంట మెత్తము పసుపు వర్ణంలోకి మారిపోవడం, అక్కడి నేలల్లో సల్ఫైడు (గంధకపు) దుష్ఫ్రభావం వలన సంభవించును. ఇటువంటి ప్రాంతములో, నేలమడి బాగా మెత్తగా ఉండి, కాలు చాలా లోతుగా దిగబడిపోవును. పొలంలో నడుస్తుంటే బుడగలు రూపంలో గాలి బయటకు వస్తుంది. నేల నుండి దుర్గందపు వాసన మరియు మొక్కను వేర్లతో బయటకు తీసినప్పుడు క్రుళ్లిన కోడి గుడ్ల వాసన వచ్చును. పంటవేర్లు పూర్తిగ నల్లబడి జీవము లేక కిళ్ళిన వాసన వస్తుంది. మొక్కలు పూర్తిగా చనిపోయే ఆస్కారమున్నది.
వరి చేనులో ఇటువంటి పరిస్థితికి కారణం:
అధిక నీటి ముంపు ఉండటం, తగిన రీతిలో పంట వేర్లకు గాలి అందకపోవడం, నేలలో రసాయన చర్యల వలన లభ్య ఇనుము మార్పు చెందడం, చాలా కాలంగా బరువు నేలల్లో సల్ఫరు (గంధకము) కలిగిన 20-20-0-15, 20-20-0-13 లాంటి కాంప్లెక్సు ఎరువులను అధికంగా వాడటం.
పాటించాల్సిన జాగ్రత్తలు:
ఇటువంటి పరిస్థితులలో మొక్క వేర్లకు తగిన గాలి తగిలే విధంగా, మురుగు నీటిని తీసి మళ్ళీ నీరు అందివ్వాలి. పైరు వేయటానికి మడిని తయారు చేయుటకు ముందు ఇటువంటి ప్రాంతాలలో మట్టిని బాగా కలియబెట్టి ఆరబెట్టడం, భూమిని ఎత్తుచేయడం, 1-2 బండ్ల ఎర్రమట్టిని వేయటం చేయాలి. పంట మద్యకాలంలో పొలాల్ని సన్న నెఱ్ఱెలు వచ్చేవరకు ఆరగట్టి అప్పుడప్పుడు మళ్ళీ నీరివ్వాలి. ఈ చర్యలతో క్రమంగా సల్ఫైటు దుష్ప్రభావం తగ్గుతుంది. అమ్మోనియం సల్పేట్ వంటి ఎరువులను ఇటువంటి పొలాల్లో వాడకూడదు.
కాండం తొలిచే పురుగు (మొగి పురుగు):
గత వారం రోజులుగా కాండం తొలిచే పురుగు ఉదృతి ఎక్కువగా గమనించడం జరుగుతుంది.నారుమడిలో ఆశిస్తే మొక్కలు పిలక దశలో ఆశిస్తే మొవ్వలు ఎండి చనిపోతాయి, అంకురం నుండి చిరు పొట్ట దశలో ఆశిస్తే ఈనిన తర్వాత తెల్ల కంకులు బయటకు వస్తాయి.సాధారణం గా తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు ఉండి సూర్య రష్మి రోజుకు 7:00 కంటే ఎక్కువ గా ఉండటం,నత్రజని తక్కువగా వాడటం వలన కాండం బలహీనం కావడం ఈ పురుగు ఆశించడానికి అనుకూలం ముఖ్యంగా యాసంగి వరి పైరులో ఎక్కువగా ఆశిస్తుంది.నివారణ చర్యలు
నారు పీకే ఏడు రోజులు ముందు రెండు గంటలు మడికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3 జి గుళికలను చల్లి ఆ మడిలోనే ఇంకేటట్లు చేయాలి. ముదురునారు నాటేటప్పుడు నారు కొనలను తుంచి నాటాలి.పురుగు ఉధృతిని గమనించడానికి దీపపు ఎరను,సోలార్ దీపపు ఎర లేదా లింగాకర్షక బుట్టలను అమర్చుకొని రెక్కల పురుగులపై నిఘా పెట్టాలి.
పిలకదశలో ఎకరాకు 3 లింగాకర్షక బుట్టలు పెట్టి అందులో వారానికి బుట్టకు 25-30 పురుగులు పడినప్పుడు తప్పనిసరిగా సస్యరక్షణ చేపట్టాలి.
పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బోఫిరాన్ 3జి గుళికలను ఎకరానికి 10 కిలోల చొప్పున లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4 జి గుళికలను 8 కిలోల చొప్పున లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 జి 4 కిలోలు వేయాలి.
వీటితో పాటు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్.పి 2 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 యస్.సి 0.3 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. పురుగు యొక్క ఉదృతి ఎక్కువగా ఉన్నపుడు టెట్రనిలిప్రోల్ (వయ్యాగో),100 మి.లీ ఎకరానికి దింతో పాటు వేపా నునే (1500 పిపిఎమ్) 500 లేధా ఐసోసైక్లోసెరమ్(ఇన్సిపియో) 120 మి.లీ ఓక ఎకరైనికి లేధా బాసిల్లస్ తురేంజెనిసిస్ 500 గ్రాములు +క్లోరాంట్రో నీలిప్రోల్ 60 మి.లీ కలిపి పిచ్కారి చేసుకున్నట్లు అయితే మొగి పురుగును సమర్దవంతంగా అరికట్టవచ్చు అని తెలియజేశారు.
