- ఫైనల్ మ్యాచ్ వేళ అప్రమత్తమైన పోలీసులు..!
- మ్యాచ్ మోజులో హద్దులు దాటొద్దు..!
- బెట్టింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు : ఏసీపీ మాధవి

హుజూరాబాద్/ధనాధన్ న్యూస్,మే 31 :
ఈ రోజు జరగనున్న క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హుజూరాబాద్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏసీపీ వాసంశెట్టి మాధవి తెలిపారు. మ్యాచ్ నేపథ్యంలో ఎలాంటి బెట్టింగ్ కార్యకలాపాలు, అవాంఛనీయ ఘటనలు, గొడవలు చోటు చేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఏసీపీ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, ప్రజా రద్దీ ప్రాంతాలు, సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపారు. క్రికెట్ మ్యాచ్‌ను ఆసరాగా చేసుకుని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే యువత బైక్ ర్యాలీలు, ప్రమాదకర స్టంట్లు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. విజయోత్సాహం పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ప్రజలు శాంతియుత వాతావరణంలో మ్యాచ్‌ను వీక్షించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీసు అధికారులకు సమాచారం అందించాలని ఏసీపీ వాసంశెట్టి మాధవి కోరారు. ప్రజల సహకారంతో హుజూరాబాద్ డివిజన్‌లో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.