విత్తన డీలర్లతో వ్యవసాయ అధికారుల సమావేశం

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే25:వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విత్తన డీలర్లకు కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏడీఏ జీ.సునిత మాట్లాడుతూ విత్తన డీలర్లు అందరూ కూడా అనుమతి ఉన్న విత్తనాలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని,విత్తనాలు కొనుగోలు చేసిన ప్రతి రైతుకి బిల్లు తప్పనిసరిగా అన్ని వివరాలతో ఇవ్వాలని,విత్తన అమ్మకాల వివరాలు రైతు వారీగా రిజిస్టర్లో నమోదు చేయాలని తెలిపారు.రైతుకు నష్టం కలిగేలా ఎలాంటి విత్తన అమ్మకాలు,ఎరువులు,పురుగుమందుల అమ్మకాలు చేయకూడదని,ఏదైనా అనుమతి ప్రకారం లేకపోతే లైసెన్సు రద్దు చేయడంతో పాటు ఆక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.అదే విధంగా వర్షాకాలం పంట సాగుకై సన్నద్ధంగా ఉన్న రైతు సోదరులకు  కొన్ని సూచనలు తెలియజేయటం జరిగింది.రైతులు విత్తన కొనుగోళ్లలో అవగాహన కలిగి ఉండాలని,పత్తి లేదా ఇతర విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు లైసెన్స్ కలిగిన దుకాణాలలోనే విత్తనాలు కొనుగోలు చేసి బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని,విడి విత్తనాలను ఎట్టి పరిస్థితులలో కొనుగోలు చేయవద్దని బిల్లును పంట కాలం ముగిసే వరకు జాగ్రత్త పరుచుకోవాలని సూచించారు.ఇంకా ఉష్ణోగ్రతలు అధికంగానే ఉన్నందున లోతు దిక్కులు చేసుకుని భూమిలోపలి పొరలు ఎండకి ఎండినట్లయితే సుప్తావస్త లో ఉన్న పురుగులు,తెగుళ్లు కలిగించే హానికారకాలను అరికట్టవచ్చు. ముఖ్యంగా వరిలో మొగిపురుగు, పత్తిలో వేరుకుల్లు గత సంవత్సరం ఉధృతి ఎక్కువగా ఉండటం వలన వాటికి సంబంధించిన సుప్తావస్థ దశలను అరికట్టి తద్వారా వర్షాకాలంలో పంటలను కాపాడుకోవచ్చు.వరిలో గత పంట కొయ్య కాలు కాల్చకుండా నారుమడి వేసిన దగ్గరినుండి నాటు వేసే పొలంలో కూడా నీరు కట్టి,దున్ని,సూపర్ ఫాస్ఫేట్ వేసి కొయ్య కాలు భూమిలో మురిగేటట్లుగా చేస్తే వరిలో యూరియా అవసరం కొంతవరకు తగ్గించుకోవచ్చు మరియు భూమి భౌతిక స్థితి,కర్బన శాతం పెరిగి పంట ఆరోగ్యంగా ఉంటుంది. సుప్తావస్థలో మొగిలో ఉన్న పురుగులు కూడా కొంతవరకు అరికట్టవచ్చునని,గింజలు పొడి దుక్కిలో వేసే అలవాటు ఉన్న రైతులు ఋతుపవనాలు వచ్చిన తరువాత ఉష్ణోగ్రతలు తగ్గి, ఒకటి లేదా రెండు వర్షాలు పడిన తరువాతనే నీటి లభ్యత చూసుకొని విత్తనం వేసినట్లయితే విత్తనం మాడిపోయి మళ్లీ విత్తనం వేయాలంటే ఖర్చుతో పాటు విత్తన కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని,కావున తొందరపడి విత్తనాలు వేయవద్దని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం పోలీస్ శాఖతో పాటు మండలకేంద్రంలోని పలు ఫెర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చెయ్యటం జరిగింది.ఈ కార్యక్రమంలో సైదాపూర్ మండల వ్యవసాయధికారి వైదేహి,ఏఎస్ఐ మల్లారెడ్డి,ఏఈఓ నిఖిల్ కుమార్,డీలర్లు,రైతులు పాల్గొన్నారు