హుజురాబాద్‌లో బంద్ విజయవంతం – డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ప్రజల ఐక్యరూపం

హుజురాబాద్ బంద్ సంపూర్ణం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన బంద్ విజయవంతంగా సాగింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరియు జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు తెలపడంతో పట్టణం పూర్తిగా మూతపడింది.
బంద్ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నాయకత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించబడింది. అనంతరం ఆయన మాట్లాడుతూ, హుజురాబాద్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.


ఈ సమస్యపై రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కటై పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరింత తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


ఈ నెల 7, 8 తేదీలలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాలో తాను పాల్గొంటానని తెలిపారు. బంద్‌కు సహకరించిన ప్రజలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a comment