ఎండదెబ్బతో గొర్రెల కాపరి మృతి

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 5: మండలంలోని పెర్కపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు ఎండదెబ్బ తగిలి మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిల్లి శ్రీశైలం (29) గురువారం ఉదయం గొర్రెలను మేపేందుకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో తీవ్ర ఎండ ప్రభావంతో తల తిరగడం, వాంతులు, విరేచనాలు అవుతున్నాయని తన తండ్రి పిల్లి తిరుపతికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు.


దీంతో తిరుపతి గ్రామానికి చెందిన పిల్లి ఎల్లయ్య, ముత్యాల కృష్ణ, పోతరాజు కర్ణాకర్‌లకు సమాచారం అందించి శ్రీశైలాన్ని ఇంటికి తీసుకురావాలని కోరాడు. పోతరాజు కర్ణాకర్‌కు చెందిన ఆటోలో శ్రీశైలాన్ని ఇంటికి తీసుకువచ్చారు. అయితే ఇంటికి వచ్చిన అనంతరం కూడా అతని ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది.
వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సుమారు మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని శ్రీశైలాన్ని పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.


రోజూ ఎండలో గొర్రెలను మేపేందుకు వెళ్లే క్రమంలో తీవ్ర వడదెబ్బ తగలడంతోనే శ్రీశైలం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుడి మరణంపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a comment