జగిత్యాల జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ఐఎంఏ ముందడుగు

  • యాంటీ డ్రగ్ 3కే రన్ కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 13: మాదకద్రవ్యాల వ్యసన నిర్మూలనకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించనున్న “యాంటీ డ్రగ్ 3కే రన్” కార్యక్రమ కరపత్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ శనివారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యువతను లక్ష్యంగా చేసుకుని విస్తరిస్తున్న మాదకద్రవ్యాల వ్యసనం దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ దుర్వినియోగంపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన పెంపొందించేందుకు ఐఎంఏ జగిత్యాల చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. సమాజంలో ఆరోగ్యకరమైన జీవన విధానాలను ప్రోత్సహించేందుకు వైద్యులు ముందుకు రావడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.


“రన్ స్ట్రాంగ్ – లివ్ ఫ్రీ, సే నో టు డ్రగ్స్” అనే నినాదంతో నిర్వహించనున్న ఈ 3కే రన్ జగిత్యాల పాత బస్టాండ్ సమీపంలోని శ్రీ వివేకానంద మినీ స్టేడియం నుంచి ప్రారంభమై ఐఎంఏ భవన్ వరకు కొనసాగనుంది. విద్యార్థులు, యువత, వైద్యులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మాదకద్రవ్యాల వ్యతిరేక సందేశాన్ని సమాజానికి చాటాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఐఎంఏ జగిత్యాల కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. యువత వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే ఈ అవగాహన పరుగు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, యువత ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. యాంటీ డ్రగ్ 3కే రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐఎంఏ జగిత్యాల కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి డాక్టర్ కోటగిరి సుధీర్ కుమార్, డాక్టర్ వడ్లూరి శ్రవణ్ కుమార్, డాక్టర్ బండెల విజయ్, డాక్టర్ ఇనుగుర్తి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment