
జమ్మికుంట/ధనాధన్ న్యూస్ జూన్ 13: ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ మీడియా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు గండి రంజిత్ కుమార్ గౌడ్‌కు ప్రతిష్టాత్మక తెలంగాణ స్ఫూర్తి నంది పురస్కారం లభించింది.జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో వరంగల్‌లోని టీఎన్‌జీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు.దాదాపు రెండు దశాబ్దాలుగా మీడియా రంగంలో సేవలందిస్తున్న రంజిత్ కుమార్ గౌడ్ ప్రజా సమస్యలను గుర్తించి వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. సమాజ సేవలో తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలు పొందిన ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.
అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారుల కార్యక్రమాలను చిత్రీకరిస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమానికి మీడియా ద్వారా తన వంతు సహకారం అందించారు.
ఈ సందర్భంగా గండి రంజిత్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఈ పురస్కారం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.