మహా ముత్తారం, జూలై 29(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం నిమ్మగూడెం–పెగడపల్లి గ్రామాల మధ్య ఉన్న పెద్ద వాగులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజల భద్రత దృష్ట్యా నిమ్మగూడెం గ్రామపంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు.వాగు దాటే మార్గంలో గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను అడ్డంగా నిలిపి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. నీటి ప్రవాహం తగ్గే వరకు ఎవరూ వాగును దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు హెచ్చరించారు.
అత్యవసర పరిస్థితులు మినహా ఈ మార్గంలో ప్రయాణాలు చేయకుండా, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని గ్రామపంచాయతీ అధికారులు ప్రజలకు సూచించారు. వరద ప్రవాహం పూర్తిగా తగ్గిన తర్వాతే రాకపోకలను పునరుద్ధరిస్తామని తెలిపారు.ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని గ్రామపంచాయతీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply