సైదాపూర్,అక్టోబర్ 26 (ధనాధన్ న్యూస్): ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణికి సైదాపూర్ మండలంలో అనూహ్య స్పందన లభించింది. సైదాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఎంపీడీవో యాదగిరి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో యాదగిరి మాట్లాడుతూ ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గతంలో మండల ప్రజలు తమ సమస్యలను జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో తెలియజేసేందుకు కరీంనగర్ వెళ్లాల్సి వచ్చేదని, కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం సైదాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమకు ఉన్న సమస్యలను ప్రజావాణి ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో తెలిపారు.


ప్రజావాణికి కొంతమంది అధికారులు గైర్హాజరైనట్లు ఎంపీడీవో యాదగిరి తెలిపారు. గైర్హాజరైన అధికారుల వివరాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.ప్రజావాణిలో తహసీల్దార్ విభాగానికి సంబంధించి మూడు దరఖాస్తులు, హౌసింగ్ విభాగానికి ఐదు దరఖాస్తులు, ఎంపీవో విభాగానికి ఒక దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు. మొత్తం తొమ్మిది దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంపీడీవో వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, ఎంపీడీవో యాదగిరి, తహసీల్దార్ శ్రీనివాస్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply