- రూ.10 వేల లంచంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సర్వేయర్
- సోమారం చౌరస్తాలో ఏసీబీ దాడి.. సర్వేయర్ అరెస్ట్

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 5:
మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. భూమి సర్వే నిర్వహించేందుకు రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన మండల సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సర్వేయర్‌తో పాటు ఇద్దరు సహాయకులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ గ్రామానికి చెందిన రైతు చుంచు మహేందర్‌కు సైదాపూర్ మండలం అమ్మనగుర్తి గ్రామ శివారులో మూడు ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని సర్వే చేయించేందుకు ఈ ఏడాది మే 17న తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.
సర్వే నిర్వహించేందుకు మండల సర్వేయర్ యెక్కలదేవి కుమారస్వామి రూ.25 వేల లంచం డిమాండ్ చేసినట్లు బాధిత రైతు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో మే 23న సర్వేయర్ సహాయకుడు రాజేష్‌కు రూ.5 వేలు, మరో సహాయకుడు విహిత్రెడ్డికి రూ.10 వేలు అందజేశారు. మిగిలిన రూ.10 వేల లంచాన్ని శుక్రవారం సైదాపూర్ మండలం సోమారం గ్రామ చౌరస్తా వద్ద సర్వేయర్ కుమారస్వామికి ఇస్తుండగా, ముందస్తు సమాచారంతో మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ ఘటనలో సర్వేయర్ కుమారస్వామితో పాటు సహాయకులు రాజేష్, విహిత్రెడ్డిలను అరెస్టు చేసి, ఎస్పీఈ & ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.ప్రభుత్వ అధికారులు లేదా ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు పున్నం చందర్, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.