- వెన్కేపల్లి గ్రామ సర్పంచ్ మునిపాల సునీత రవి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్కేపల్లి గ్రామ పంచాయతీ ప్రాంగణంలో బుధవారం రోజున సర్పంచ్ మునిపాల సునీత అధ్యక్షతన భూభారతి రీ సర్వేపై రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, భూమి ప్రతి రైతుకు ఎంతో విలువైన ఆస్తి అని, భూమికి సంబంధించిన రికార్డులు సక్రమంగా ఉండటం భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.భూభారతి రీ సర్వే ప్రక్రియపై రైతులు పూర్తి అవగాహన పెంచుకోవాలని, తమ భూములకు సంబంధించిన వివరాలు, రికార్డులను పరిశీలించుకోవాలని సూచించారు. సర్వే ప్రక్రియలో రైతులకు ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు. అధికారులు అందిస్తున్న సూచనలు, సలహాలను పాటిస్తూ రీ సర్వే ప్రక్రియలో రైతులందరూ చురుకుగా భాగస్వాములు కావాలని కోరారు. భూములకు సంబంధించిన విషయాల్లో నిర్లక్ష్యం చేయకుండా, తమ హక్కులకు సంబంధించిన రికార్డులపై స్పష్టత పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏ. కిషన్ రావు, డి ఐ ఓ ఎస్, గణపతి, డీఐ గాజుల రత్నం, పి. లక్ష్మణ్ నాయబ్ తహశీల్దార్, మండల ఆర్. ఐ. వినోద్ కుమార్, సర్వేయర్ మనోజ్, గ్రామ ఉపసర్పంచ్ వినయ్ కుమార్ జీపీఓ స్వప్న. జి పి ఓ రజిత రెవెన్యూ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
