కొత్తపల్లిలో మార్మోగిన అయ్యప్ప శరణు ఘోష

By dhanadhannews.com

  • రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మహా దివ్య పడిపూజ

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని కొత్తపల్లి గ్రామం నిన్న (మంగళవారం) ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. స్థానిక నాగేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో పోరెడ్డి రవీందర్ రెడ్డి తన 18వ పడి సందర్భంగా మహా దివ్య పడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అయ్యప్ప స్వామి శరణు ఘోషతో ఆ ప్రాంతమంతా మారు మ్రోగింది.

పండితుల మంత్రోచ్ఛారణల మధ్య
మోతే తిరుపతి గురుస్వామి, కే వెంకట్రావు, కన్నన్ దురై రాజ్ గురు స్వాముల ఆధ్వర్యంలో ఈ మహా పడిపూజ వేడుక జరిగింది. పేద పండితులు అవధారుల భాస్కర్ శర్మ, కాట్రపల్లి శ్రీకాంత్ శర్మల మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగాయి.
సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు సుమారు 500 మందికి పైగా అయ్యప్ప స్వాములు, నానుస్వాములు ఈ దివ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. హుజురాబాద్ పట్టణం, వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి సుమారు 300 మంది మాలధారులు, 200 మంది నానుస్వాములు భక్తిశ్రద్ధలతో హాజరయ్యారు. జమ్మికుంటకు చెందిన గురుస్వామి జయేందర్ స్వామి ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామాల స్వాములు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ప్రముఖ గాయకులు వడ్లకొండ అనిల్ కుమార్, హుజురాబాద్ శివరామకృష్ణ, కొత్తపల్లి రామానంద భజన మండలిల ఆధ్వర్యంలో నిర్వహించిన భజన – కీర్తనలు ఆ ప్రాంతంలో భక్తి వాతావరణాన్ని పెంపొందించాయి.
ముఖ్యంగా, రవీందర్ రెడ్డి పడి అంటించగానే, ఒక్కసారిగా స్వాములు లేచి, “స్వామియే శరణమయ్యప్ప” అంటూ కొలవడం ఆ ప్రాంతంలో భక్తి పారవశ్యాన్ని తారాస్థాయికి చేర్చింది. మహిళలు సైతం పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని ఆరాధించారు.

హుజురాబాద్ పట్టణంలోని కొత్తపల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద దివ్య మహా పడిపూజ నిర్వహించడం జరిగింది. ఈ అపూర్వ ఘట్టంతో గ్రామస్తులు అత్యంత భక్తి పరవశ్యంలో మునిగిపోయారు. పూజానంతరం హాజరైన భక్తులకు తీర్థప్రసాదాలు, అల్పాహారం అందజేశారు. ఈ ఘనకార్యం విజయవంతం కావడంలో రవీందర్ రెడ్డి కృషిని పలువురు అభినందించారు.