
సైదాపూర్/ధనాధన్ న్యూస్ ఏప్రిల్ 14:
సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గుర్రాల స్వతంత్ర ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ విగ్రహాలకు కూడా పూలమాలలు సమర్పించారు.
కార్యక్రమంలో సర్పంచ్ గుర్రాల స్వతంత్ర మాట్లాడుతూ, చిన్ననాట కుల వివక్షను ఎదుర్కొన్నప్పటికీ డా. అంబేద్కర్ తన దృఢ సంకల్పంతో ఉన్నత విద్యను అభ్యసించి కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్‌లో డాక్టరేట్ పొందారని పేర్కొన్నారు. దళితులు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు.
కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం డా. అంబేద్కర్ ఎన్నో చట్టాలను తీసుకువచ్చారని, సమాన వేతనం, వేతనంతో కూడిన సెలవులు, పరిమిత పని గంటల కోసం కృషి చేశారని తెలిపారు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించి, 1937లో బొంబాయి శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించారని గుర్తుచేశారు.
భారత రాజ్యాంగ రచన ద్వారా స్వేచ్ఛ, సమానత్వం, ఓటు హక్కు వంటి మౌలిక హక్కులను ప్రజలకు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. నేడు గ్రామ స్థాయి నుంచి దేశ ప్రధాని స్థాయి వరకు పదవులు పొందడం ఆయన రచించిన రాజ్యాంగం వల్లే సాధ్యమైందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ డైరెక్టర్ మద్దూరి రజిత, హుస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి, పంచాయతీ కార్యదర్శి తాటి పెళ్లి శ్రీనివాస్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు రజిత, రమా, వార్డు సభ్యులు కొల్ల రాజిరెడ్డి, గుర్రాల చిన్న లక్ష్మారెడ్డి, జెల నాగరాజు, మామిడి సురేష్, తోట వేణు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.