
హుజూరాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో ఉన్న కల్వరి టెంపుల్లో ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సంఘ కాపరి పాస్టర్ నెల్సన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరిపారు.ఈస్టర్ పర్వదినం సందర్భంగా, గుడ్ ఫ్రైడే నాడు యేసు క్రీస్తు శిలువపై మరణించి, ఆదివారం తిరిగి లేచిన దినాన్ని పునరుత్థాన ఈస్టర్‌గా భావిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో సభాధ్యక్షుడిగా బండ రమేష్ వ్యవహరించి కార్యక్రమాన్ని సమర్థంగా నడిపించారు.

ఉదయం నుంచే క్రైస్తవులు నూతన వస్త్రధారణతో టెంపుల్‌కు చేరుకుని ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోసన్నా మినిస్ట్రీస్‌కు చెందిన రెవ. డి. రవీందర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తడికమళ్ల శేఖర్ హాజరయ్యారు. తన జీవితంలో యేసయ్య చేసిన అద్భుతాలను డాక్టర్ శేఖర్ భావోద్వేగంతో సాక్ష్యంగా చెప్పగా, సంఘ సభ్యులు కంటతడి పెట్టారు.

అనంతరం దైవజనులు రవీందర్ గారు స్తుతి, ఆరాధనల ద్వారా భక్తులను ఉత్సాహపరిచారు. అనంతరం చక్కని దైవ సందేశాన్ని అందించారు.ఈ సందర్భంగా బొడ్డు మొగిలి – పూల దంపతులు ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్‌ను పాస్టర్ నెల్సన్ – సుదిన దంపతులు, అతిథులతో కలిసి కట్ చేసి అందరికీ పంచిపెట్టారు.
గుడ్ ఫ్రైడే నుండి ఈస్టర్ వరకు 40 రోజుల ఉపవాసం ముగిసిన సందర్భంగా, బండ రమేష్ – మాధవి దంపతులు హాజరైన ప్రతి ఒక్కరికీ ప్రేమ విందును ఏర్పాటు చేశారు.
అదేవిధంగా, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పాస్టర్ నెల్సన్ – సుదిన దంపతులను, అతిథులను, కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లను, అలాగే విద్యార్థిగా ఉండి 40 రోజుల ఉపవాసం చేసిన బొడ్డు కిరణ్ తేజ్‌ను ఘనంగా సన్మానించారు.
చివరిగా దైవజనులు అందరికీ ప్రత్యేక ప్రార్థనలు చేసి, దేవుని ఆశీర్వాదాలు అందించి కార్యక్రమాన్ని ముగించారు.