- శిథిలావస్థలో భవనం.. భయాందోళనలో గ్రామ ప్రజలు

సైదాపూర్, ధనాధన్ న్యూస్:సుమారు 50 ఏళ్ల చరిత్ర కలిగిన పాత ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ భవనంలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని నిర్వహిస్తుండటంపై దుద్దెనపల్లి గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైదాపూర్ మండలంలోని లింగాల దుద్దెనపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణంలో ఉండటంతో తాత్కాలికంగా పాత ఎస్సీ హాస్టల్ భవనంలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే సుమారు ఐదు దశాబ్దాల నాటి భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని, పైకప్పు బీటలు వారడంతో పాటు ఎప్పుడు ఏ భాగం కూలుతుందోనన్న భయం నెలకొన్నదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు వివిధ పనుల నిమిత్తం గ్రామపంచాయతీ కార్యాలయానికి రావాల్సి ఉండటంతో భవనం పరిస్థితిని చూసి భయాందోళనకు గురవుతున్నామని వారు చెబుతున్నారు.ఇలాంటి పురాతన, శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనంలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని నిర్వహించడం ఎంతవరకు సమంజసమని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రజలకు, సిబ్బందికి ఇబ్బందులు లేకుండా సురక్షితమైన మరో భవనాన్ని అద్దెకు తీసుకుని కార్యాలయాన్ని నిర్వహిస్తే బాగుండేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
శిథిలావస్థలో ఉన్న ఎస్సీ హాస్టల్ భవనంలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని నిర్వహించడంపై స్థానిక సర్పంచ్, సంబంధిత అధికారుల తీరుపై గ్రామస్థులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భవనం పరిస్థితిని పరిశీలించి, ప్రజలు మరియు సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని సురక్షితమైన భవనంలోకి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మార్చాలని దుద్దెనపల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు.
