సైదాపూర్‌లో అభివృద్ధి పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం

సైదాపూర్/ధనధాన్ న్యూస్ ఏప్రిల్ 28: సైదాపూర్ మండలంలోని విశాల సహకార ప్రకృతి సంఘం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల వారీగా పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కార్యకర్తలకు సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఆరోగ్య పరిరక్షణ కోసం మెడికల్ క్యాంపులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.ప్రతి మండలానికి ఒక మెడికల్ కాలేజీ దత్తత తీసుకున్న నేపథ్యంలో గ్రామస్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.


హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని సైదాపూర్ మండల అభివృద్ధిపై జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, ధాన్యం తరలింపు, చెల్లింపులు సమయానికి జరిగేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసి, ఇప్పటికే పూర్తైన ఇళ్లకు గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్లు అశ్వినీ తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, డీఆర్‌డీవో శ్రీధర్, ఆర్డీవో రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, ఎమ్మార్వో శ్రీనివాస్, ఎంపీడీవో యాదగిరి, అంగన్వాడి సూపర్వైజర్ హిమవర్షా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు హాజరయ్యారు.

Leave a comment