రంగాపూర్ కల్వరి టెంపుల్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

By dhanadhannews.com

హుజురాబాద్/ధనాధన్ న్యూస్:మండలంలోని రంగాపూర్ కల్వరి టెంపుల్‌లో నూతన సంవత్సర ఆరాధన మరియు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రెవరెండ్ డాక్టర్ పి.ఆర్. నెల్సన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి గుంటూరు నుండి ముఖ్య అతిథిగా విచ్చేసిన రెవరెండ్ డాక్టర్ చెల్లీ అశోక్ కుమార్ ప్రత్యేక వాక్య సందేశం అందిస్తూ స్తుతి ఆరాధన నిర్వహించారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం గణాంకాల ఆధారంగానే ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర క్యాలెండర్లు అమల్లోకి వచ్చాయని, క్రీస్తు పుట్టుక మరియు ఆయన చేసిన సేవలు ప్రపంచ మానవాళికి ఎంతో మేలు చేకూర్చాయని పేర్కొన్నారు. యేసు క్రీస్తు చూపిన మార్గం ప్రపంచ శాంతికి దిక్సూచిలా నిలుస్తుందని ఆయన బోధించారు.
చర్చి ఫాదర్ నెల్సన్ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర బైబిల్ వాగ్దానాలను అందజేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సంఘ క్వయర్ బృందం పాడిన భక్తి గీతాలు, పిల్లల నృత్య ప్రదర్శనలు మరియు యువత ప్రదర్శించిన స్కిట్స్ క్రైస్తవులతో పాటు హాజరైన ఇతర ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం సేవా కార్యక్రమంలో భాగంగా పంచాయతీ సెక్రెటరీ బండ ప్రసాద్ అందజేసిన చీరలను పేదవారికి పంపిణీ చేశారు. అతిథి అశోక్ కుమార్ చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. తదనంతరం ఫాదర్ నెల్సన్ దంపతులు అతిథులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. చివరగా చర్చి క్యాలెండర్లను ఆవిష్కరించి వేడుకలను ముగించారు.

క్యాలెండర్ ఆవిష్కరణ