ప్రవేట్ పాఠశాల వద్దు..గవర్నమెంట్ పాఠశాల ముద్దు

  • మెరుగైన విద్య కోసం గవర్నమెంట్ పాఠశాలకు పంపించాలి – హెచ్ఎం బొట్ల రామస్వామి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా “జయశంకర్ బడిబాట” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ చేపట్టారు.
ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం బొట్ల రామస్వామి మాట్లాడుతూ, ప్రతి తల్లిదండ్రులు తమ బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.


ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల భారం అధికంగా ఉండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు పలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆకునూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉత్తమ విద్య అందిస్తున్నామని, గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.


గ్రామ సర్పంచ్ గుర్రాల స్వతంత్ర మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాలు ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. మెరుగైన విద్య కోసం ప్రభుత్వ పాఠశాలలను ఆదరించాలని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కస్తూర్బా బాలికల విద్యాలయం హెచ్‌ఎం రజిత, ఉపాధ్యాయులు సుధాకర్, భాస్కర్, సమ్మయ్య, సుజాత, అనిత, రవీందర్ రెడ్డి, ఆర్య, గ్రామ కార్యదర్శి తాటిపెల్లి శ్రీనివాస్ రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment