
హుస్నాబాద్/ధనాధన్ న్యూస్: ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతూ, వర్షాలు కురవాల్సిన సమయంలోనూ వర్షాల జాడ కనిపించకపోవడంతో హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామస్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.గ్రామంలో ఉన్న గ్రామదేవతలు, వనదేవతలు, హనుమంతుడు, భైరవాది గుట్టలోని కాలభైరవ స్వామికి జలాభిషేకాలు చేసి వర్షాలు కురవాలని వేడుకున్నారు. సంప్రదాయ ఆచారాల ప్రకారం బండపై వరద పాశం పోసి నాలుకతో అద్దడం, బతకమ్మ ఆటలు ఆడడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, పశుపక్షాదులు, ప్రజలు చల్లగా ఉండాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ చొప్పరి ప్రశాంత్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మాజీ సర్పంచ్, మాజీ వార్డు సభ్యులు, యువతీ యువకులు, చిన్నారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా కాలినడకన వెళ్లి భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.