- వైజాగ్ యువకుడి మాయ మాటలకు డాక్టర్ భార్య బలి

హైదరాబాద్/ధనాధన్ న్యూస్,మే 29: సినీ, టీవీ రంగాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త ఎత్తుగడలకు తెరలేపుతున్నారు. “సీరియల్‌లో హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తా” అంటూ ఓ ప్రముఖ వైద్యుడి భార్యను నమ్మబలికిన కేటుగాడు, దాదాపు రూ.60 లక్షలు కాజేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ మోసంలో విశాఖపట్నానికి చెందిన ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే… బాధితురాలికి టెలివిజన్, వినోద రంగాలపై ఆసక్తి ఉండటాన్ని గమనించిన నిందితుడు, తనకు పలువురు దర్శకులు, నిర్మాతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి పరిచయం పెంచుకున్నాడు. మొదట చిన్న మొత్తాల్లో డబ్బులు తీసుకుంటూ విశ్వాసం సంపాదించిన అతడు, ఆ తర్వాత “ఆడిషన్ ఫీజు”, “మేకోవర్ ఖర్చులు”, “ప్రొడక్షన్ అడ్వాన్స్”, “మెంబర్‌షిప్ ఛార్జీలు” పేర్లతో విడతలవారీగా భారీగా నగదు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
మోసం ఇక్కడితో ఆగలేదు. బాధితురాలి బ్యాంక్ ఖాతా నుంచి సుమారు రూ.22 లక్షల విలువైన లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన బాధితురాలు తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు రంగంలోకి దిగారు. కారును విక్రయించిన షోరూమ్‌కు వెళ్లిన నగదు లావాదేవీలపై అనుమానం వ్యక్తం చేస్తూ సంబంధిత బ్యాంక్ ఖాతాను తాత్కాలికంగా ఫ్రీజ్ చేసినట్లు సమాచారం.
అకౌంట్ ఫ్రీజ్ కావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న కార్ల షోరూమ్ యాజమాన్యం, తాము చట్టబద్ధంగానే వాహనం విక్రయించామని చెబుతూ విశాఖపట్నం పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. దీంతో కేసు మరింత ఆసక్తికర మలుపు తిరిగింది.
ఇప్పటికే కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలు, సోషల్ మీడియా చాటింగ్, నగదు బదిలీలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. త్వరలోనే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో సినిమా అవకాశాలు, మోడలింగ్, టీవీ సీరియల్ ఛాన్స్‌లు, సోషల్ మీడియా ప్రమోషన్ల పేర్లతో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.