హుజురాబాద్‌లో ఆధ్యాత్మిక శోభ

By dhanadhannews.com

  • కాళ్ళ సంతోష్ ఆధ్వర్యంలో మహా దివ్య పడిపూజ
  • 500 మంది అయ్యప్ప స్వాములతో మారుమోగిన వాసవి ఇండస్ట్రీస్ ప్రాంగణం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా,హుజురాబాద్ ప్రాంతంలో ఆదివారం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రముఖ రైస్ మిల్లు వ్యాపారులు కాళ్ళ సంతోష్ మరియు ఆయన ధర్మపత్ని అనిమ దంపతులు తమ స్వంత ఆర్థిక సహకారంతో మహా దివ్య పడిపూజ మరియు స్వాములకు భిక్ష కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.వరంగల్ రోడ్డులోని పరకాల క్రాస్ సమీపంలో గల వాసవి ఇండస్ట్రీస్‌ (ఎం.ఆర్.ఎం) ప్రాంగణం ఈ దివ్య కార్యక్రమానికి వేదికైంది. కల్లూరు వెంకట్రావు, కన్నన్ దురై రాజ్ గురు స్వాముల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.


శరణు ఘోషతో మార్మోగిన ప్రాంగణం
ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి అయ్యప్ప మాల ధరించిన సుమారు 500 మంది స్వాములు మరియు 200 మంది నానుస్వాములు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య సాగిన ఈ పూజలో పాల్గొన్న స్వాములు నినాదించిన శరణు ఘోషతో ఆవరణమంతా మార్మోగిపోయింది.
హుజురాబాద్ శివరామకృష్ణ, రామానంద భజన మండలిల భజన-కీర్తనలు భక్తి వాతావరణాన్ని పెంపొందించాయి. రైస్ మిల్ వ్యాపారులు, ఆడితి వ్యాపారులు, కిరాణా వర్తక సంఘం నాయకులు సహా పలువురు ప్రముఖులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.


మొదటి పెద్ద పడిపూజ
కాళ్ళ సంతోష్ దంపతులు భక్తిశ్రద్ధలతో పడిని సమర్పించగా, స్వాములు ఒక్కసారిగా లేచి ‘స్వామియే శరణమయ్యప్ప’ అంటూ అయ్యప్పను కొలిచారు. అనంతరం స్వాములకు భిక్ష, తీర్థప్రసాదాలు అందజేసి, భక్తులు పాదాభివందనం చేసుకున్నారు.
ఈ సంవత్సరం హుజురాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్న మొట్టమొదటి పెద్ద పడిపూజ ఇదే కావడం విశేషమని స్థానిక భక్తులు చర్చించుకున్నారు.