
సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని నిజమైన తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలని ఉద్యమ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేశామని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు కోసం నిర్వహించిన నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు తదితర కార్యక్రమాల్లో పాల్గొని అహర్నిశలు శ్రమించామని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అసలైన ఉద్యమకారులకు గుర్తింపు కల్పించాలని కోరారు. ఈ మేరకు జూన్ 2న వర్గ కేంద్రంలో ఉద్యమకారుల తరఫున సంబంధిత మంత్రికి వినతిపత్రం అందజేయనున్నట్లు వెల్లడించారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచి ఉద్యమకారులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వెన్నెంపల్లి సింగిల్ విండో చైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు సోమారపు రాజయ్య, చెలిమేల రాజేశ్వర్ రెడ్డి, రావుల రవీందర్ రెడ్డి, తాటిపెల్లి యుగేందర్ రెడ్డి, పైడిపెళ్లి రవీందర్ గౌడ్, ఓరుగంటి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.