జమ్మికుంట,జూలై 23 (ధనాధన్ న్యూస్): రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులను ప్రమాదం జరిగిన తొలి గంటలోపు (గోల్డెన్ అవర్) ఆసుపత్రికి తరలిస్తే వారి ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్య నిపుణులు తెలిపారు.బుధవారం జమ్మికుంటలో ట్రామా కేర్ (అత్యవసర వైద్యం)పై నిర్వహించిన అవగాహన సదస్సులో న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ దిలీప్ రెడ్డి, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ రవికుమార్ పాల్గొని మాట్లాడారు.


రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే అన్ని వైద్య విభాగాల సేవలు ఒకేచోట అందుబాటులో ఉన్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలిస్తే తక్షణమే సమగ్ర చికిత్స అందించి ప్రాణాలను కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం ఎంతో విలువైనదని, సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలే రోగిని ప్రాణాపాయం నుంచి రక్షించగలవని పేర్కొన్నారు. ప్రమాద స్థలంలో ఉన్నవారు భయాందోళనలకు గురికాకుండా బాధితుడిని సురక్షితంగా ఆసుపత్రికి తరలించేలా సహకరించాలని సూచించారు.
మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, మనోజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply