
జయశంకర్ భూపాలపల్లి,ధనాధన్ న్యూస్: సామాజిక చైతన్యం, సమానత్వం, మానవతా విలువలతో పాటు మహనీయుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో మూడు రోజుల సామాజిక చైతన్య నాటకోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఆగస్టు 14 నుంచి 16 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6:30 గంటలకు భూపాలపల్లి కృష్ణ కాలనీలోని సీఈఆర్ క్లబ్ మినీ ఫంక్షన్ హాల్లో నాటక ప్రదర్శనలు జరుగుతాయి.
ఆగస్టు 14న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితం, ఆశయాలను ప్రతిబింబించే ‘శరణం శరణం గచ్ఛామి’ నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ఆగస్టు 15న మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల సామాజిక సంస్కరణలు, సమానత్వ పోరాటాన్ని ప్రతిబింబించే ‘సత్యశోధన’ నాటకం ప్రదర్శిస్తారు.
ఆగస్టు 16న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనా ప్రస్థానం, బౌద్ధ తత్వం వైపు ఆయన ప్రయాణాన్ని ప్రతిబింబించే ‘బుద్ధునితో నా ప్రయాణం’ నాటకాన్ని ప్రదర్శించనున్నారు.
మహనీయుల జీవితాలు, సామాజిక ఉద్యమాలు, వారి ఆశయాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు సామాజిక సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, మానవతా విలువలపై చైతన్యం తీసుకురావడమే ఈ నాటకోత్సవాల ప్రధాన ఉద్దేశమని జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. యువత, విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంపొందించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.నాటకోత్సవాలకు సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని జీఎం కోరారు.
